The Truth

Wednesday, 23 August 2017

**దోషులను రక్షించే దర్యాప్తు*

*దోషులను రక్షించే దర్యాప్తు*

              'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అనే సామెతను నిజం చేసింది హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై కేంద్రం నియమించిన రూపన్‌వాల్‌ ఏకసభ్య కమిషన్‌. ఆరోపణలెదుర్కొంటున్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వర్శిటీ వైస్‌ చాన్సలర్‌ (విసి) అప్పారావులను నేరం నుండి తప్పించే లక్ష్యంతోనే కమిషన్‌ విచారణ సాగింది తప్ప రోహిత్‌ మరణానికి దారి తీసిన కారణాలను వెలికి తీసే ఉద్దేశం కమిషన్‌కు లేదని అది వెల్లడించిన 51 పేజీల నివేదిక చెపుతోంది. పైగా తన పరిధిలో లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని రోహిత్‌ అసలు దళితుడే కాదంటూ వక్కాణించి 'ప్రభు' భక్తిని ప్రదర్శించింది. నిరుడు జనవరిలో హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ అనుమానాస్పదస్థితిలో హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా దుమారం లేపింది. వర్శిటీ యాజమాన్యం దళిత విద్యార్థులపై చూపిస్తున్న దారుణాతి దారుణమైన వివక్షకు రోహిత్‌ బలయ్యాడంటూ విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, విసి, బిజెపి ఎమ్మెల్సీ, ఎబివిపి నాయకులపై ఆరోపణలు రావడంతో ఇరుకునపడ్డ మోడీ ప్రభుత్వం గతేడాది మేలో అలహాబాద్‌ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె రూపన్‌వాల్‌ కమిషన్‌ను నియమించింది. వాస్తవానికి కమిషన్‌ ఆ ఏడాది ఆగస్టుకల్లా విచారణ పూర్తి చేయాలి. కానీ నిరుడు డిసెంబర్‌ ఆఖరుకు దర్యాప్తు పూర్తి చేసి మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రిత్వశాఖకు నివేదిక అందచేసినా దాన్ని సర్కారు అత్యంత గోప్యంగా ఉంచింది. చివరికి మొన్న మంగళవారం హెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌లో ఉంచింది. తొలుత నిర్దేశించిన గడువులోపు విచారణ పూర్తి కాకపోవడం, నివేదిక ఇచ్చాక కూడా కొన్ని నెలలు బయటికి వెల్లడించక పోవడంతోనే కేంద్ర ప్రభుత్వ 'దిశానిర్ధేశా'లకు లోబడి కమిషన్‌ విచారణ జరిగిందని, ఆ వెలుగులోనే ఆరోపణలెదుర్కొంటున్న రాజకీయ నేతలు, వర్శిటీ అధికారులపై చర్యలు అవసరం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు అర్థమవుతోంది.
హెచ్‌సియులో దళితులపై చూపిస్తున్న వివక్షపై విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనలను సహించలేని విసి, బిజెపి అనుకూల విద్యార్థి సంఘ నాయకులు వర్శిటీలో 'అసాంఘిక శక్తుల'పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయకు రెండుసార్లు వినతిపత్రాలివ్వగా వాటిని సదరు మంత్రి హెచ్‌ఆర్‌డికి పంపారు. హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ ఆదేశాలనుసరించి ఐదురుగు ఎస్సీ విద్యార్థులను వర్శిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేయడమే కాకుండా హాస్టల్‌ నుంచి బహిష్కరించగా, దానిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల 'శిక్ష'కు గురైన విద్యార్థుల్లో రోహిత్‌ కూడా ఉన్నాడు. ఈ పరిణామాలతో కలత చెందే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైమాఫెసీ ఉన్నందునే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో దత్తాత్రేయ, విసి అప్పారావుతో పాటు ఎబివిపికి చెందిన ఇద్దరు నాయకులపై ఎస్సీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. వాస్తవం ఇది కాగా విచారణ చేసిన రూపన్‌వాల్‌ కమిషన్‌ వీటి జోలికి పోలేదు. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితోనే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నా డని, సూసైడ్‌ నోట్‌లో అదే ఉందని, అది వ్యక్తిగతమని చేసిన కమిషన్‌ నిర్ధారణ ముమ్మాటికీ వివక్షాపూరితం. 'వర్శిటీలోచేరే సమయంలోనే దళిత విద్యార్థులకు ఒక తాడు, ఇంత విషం ఇవ్వండి' అంటూ 2015 డిసెంబర్‌ 15న విసికి రోహిత్‌ రాసిన లేఖను తోసిపుచ్చడం అత్యంత దుర్మార్గం. అన్నింటికీ మించి రోహిత్‌ దళితుడే కాదని 'తీర్పు' చెప్పి కమిషన్‌ తన అధికార పరిధిని దాటి 'స్వామి' భక్తి పారాయణం చేసింది.
వర్శిటీలలో ఇకపై విధించే శిక్షలు, జరిమానాలపై విద్యార్థులందరికీ అప్పీలు చేసుకునే అకాశం కల్పించాలని, వివక్ష వ్యతిరేక, పర్యవేక్షక కమిటీలు, కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిషన్‌ తన నివేదికలో ఇచ్చిన సూచన ధర్మ సందేశం కాదు. ఆ సిఫారసుతో హెచ్‌సియులో వివక్ష పూరిత శిక్షలు ఉన్నాయని స్పష్టమైపోయింది. కాగా చంద్రబాబు, కెసిఆర్‌ ప్రభుత్వాలు రోహిత్‌ ఆత్మహత్య ఉదంతంపై బిజెపి కనుసన్నల్లో పని చేశాయి. వర్శిటీ ఆవరణలో విద్యార్థులు చిన్న ధర్నా చేసినా తమ ప్రాతాపం చూపే కెసిఆర్‌ పోలీసులు రోహిత్‌ ఆత్మహత్యపై కనీస విచారణ చేపట్టలేదు. దత్తాత్రేయ, విసి, తదితరులపై కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టారు. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో తెలీదు. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా ఘోరంగా ప్రవర్తించింది. రోహిత్‌ కులంపై గుంటూరు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పరిశోధించి అతను ఎస్సీ కాదని ప్రకటించింది. విసి ఆప్పారావుకు తిరుపతిలో సైన్స్‌ కాంగ్రెస్‌ వేదికపై ప్రధాని మోడీతో అవార్డులిప్పించింది. రోహిత్‌ ఆత్మహత్య కుల వివక్షకు, బిజెపి, సంఫ్‌ు పరివార్‌ హిందూ మతోన్మాదానికి నిలువెత్తు నిదర్శనం. వివక్షను అనుభవిస్తున్న వర్గాలు రోహిత్‌ బలిదానంతోనైనా కలిసొచ్చే ప్రజాతంత్ర, వామపక్ష, అభ్యుదయవాదులను కలుపుకొని పోరాడాలి

No comments:

Post a Comment