The Truth

Wednesday, 23 August 2017

నిరుద్యోగ సమస్యకు పరిష్కారమేమిటి?

నిరుద్యోగ సమస్యకు పరిష్కారమేమిటి?
గత 25 ఏళ్ళలో మన దేశ స్థూల సంపదలో అభివృద్ధి 6-7% కి మించి ఉన్నా,  కేంద్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తూన్న‌ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల పర్యవసానంగా దేశ జనాభాలో 53% ప్రజలు ఇంకా గర్భ దారిద్ర్య౦లో మగ్గుతున్నారు. పదేళ్ళ‌ క్రితం ఐక్యరాజ్య సమితి కొలబద్ద ప్రకారం రోజుకి 2 డాలర్లు (రూ. 135) కంటే తక్కువ ఆదాయం క‌లిగిన వారు దారిద్ర్య రేఖకు దిగివన ఉన్నవారిగా లెక్క అయినా, ఈ పదేళ్ళ‌లో నిత్యావసర ధరలు మూడురెట్లకు పైగా పెర‌గటంతో, రోజుకు 450 రూపాయలకు దిగువన ఆదాయం వచ్చే వారంతా పేదవారిగానే లెక్క వేయాలి. ఆవిధంగా నేడు దేశ జనాభాలో 85% లెక్కలోకి వస్తారు. గత 25 ఏళ్ళ నయాఉదారవాద విధానాల పర్యవసానంగా పేదల ఆర్ధిక పరిస్థితి దిగజారిపోగా, అపర ధనికులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి, అపారమైన సంపదను ప్రోగుచేసుకోగలిగారు. ఈనాడు దేశ జనాభాలో 10% గా ఉన్న ధనికుల చేతుల్లో 90% దేశ సంపద పేరుకుని ఉండగా, 90% జనాభా 10% సంపద కలిగి ఉన్నారు. ధనికుల పేదల మధ్యన ఆర్ధిక అంతరాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇక మనదేశంలో ఉన్న 65 కోట్ల మంది యువతలో 75% మంది 5వ క్లాసు దాటి చదవలేదు. 83% హైస్కూలు దాటలేదు. విద్య, వైద్యం, రవాణా ప్రైవేటీకరించబడి, సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవటంతో, మధ్యాన్న భోజన పధకం, ఉచిత విద్య‌ వంటి సంక్షేమ పధకాలు నామమాత్రమయిపోవటంతో, బాలలలో అత్యధికులు చదువులకు దూరమవుతున్నారు. మనదేశంలో ఈనాడు 35 కోట్లమందికి పైగా యువత నిరుద్యోగులుగా బ్రతుకుతుండగా, మరింతమంది తమ చదువులతో ఏవిధంగానూ సరిపోలని దొరికిన చిన్నాచితకా ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ అర్ధాకలితో బ్రతుకీడుస్తున్నారు. మరొక ప్రక్కన ఆఫీసులలో, ఫేక్టరీలలో, వ్యాపారాలలో కొత్త ఉద్యోగాల కల్పన అడుగంటుతున్నది. ఏటా కనీసం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించవలసి ఉండగా, ఈ రోజులలో సాలుకు 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే కల్పించబడుతున్నాయి. లక్షల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడిని తెచ్చి 'మేక్ ఇన్ ఇండియా' పేరున దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా తయారుచేస్తానని, ఏటా 2 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తానని మోడీ అట్ట‌హాసంగా ప్రారంభించిన పధకాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. విదేశీ బ్యాంకులలో దాచిన 90 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి, ప్రతీపౌరునికీ 15 లక్షల చొప్పున పంచుతామ‌ని అబద్ధపు ప్రచారంచేసి గద్దెనెక్కిన బి.జె.పి ప్రభుత్వం ఇప్పుడు అదంతా ఉత్తుత్తినే అని నాలుక మడతపెట్టి దేశ ప్రజల్ని వెక్కిరిస్తున్నారు. మన రాజకీయ నాయకులు, ధనికులు విదేశీ బ్యాంకులలో దాచుకున్న నల్లధనమే, తిరిగి మన దేశంలోకి విదేశీ పెట్టుబడి పేరున తెచ్చి, ప్రభుత్వంనుండి దానికి రెండున్నర రెట్లు రాయితీలు పొందుతున్నారు. పైగా ఏటా 35 లక్షల కోట్లు నల్లధనం మనదేశంలో తయారవుతోంది. ప్రతీ ఏట ఈ ప్రభుత్వం 6 లక్షల కోట్లు ధనికులకు పన్నురాయితీలుగా ప్రజలసొమ్మును ధార పోస్తోంది. వ్యవసాయానికి ఏటా 8 లక్షల కోట్లు ఇస్తున్నామని చెప్పుకునే ఈ ప్రభుత్వం, అందులో 96%, అంటే 7.96 లక్షల కోట్లు విదేశీ గుత్త కంపెనీలకే ధార పోస్తోంది. మన బ్యాంకులనుండి ఈనాడు 7 లక్షల కోట్లకు పైగా ధనిక వర్గాలు తీసుకున్న తీర్చని రుణాలు ఉన్నాయి. అంటే, ఏటా మన దేశ‌ సంపదలో 50 లక్షల కోట్ల‌ రూపాయలకు పైగా ధనికవర్గాలు దోచుకుంటున్నాయి.
ఆటోమేటిక్ యంత్రాల్తో నిర్మించబడే ఫేక్టరీలలో అతితక్కువస్థాయిలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. 35 కోట్లమంది యువతకు ఉన్నత సాంకేతిక శిక్షణ ఇస్తామని అట్టహాసంగా ప్రకటించిన ఈ ప్రభుత్వం  వట్టికబుర్లతో మూడేళ్ళుగడిపేసింది. ప్రంచవ్యాప్తంగా రానున్న 15 ఏళ్ళలో మొత్తం ఉద్యోగాలలో సగానికి పైగా రోబోటీకరించబడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్నవి యువతకు గడ్డురోజులు. ఉద్యోగాల కల్పన అనేది ఒట్టిమాటే? మరి బ్రతికేదెట్లా? "ఉద్యోగం అనే ఎండమావికోసం ఎదురుచూస్తూ, జీవితాన్ని వృధా చేసుకుందామా, జీవించే హక్కుకోసం పోరాటం చేయాలా?" అనేది నేడు యువత తేల్చుకోవలసిన‌ సమస్య. మన దేశంలోని 45 కోట్ల మంది పనివారిలో 93% అసంఘటిత రంగంలో, అంటే చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయ సంబంధిత రంగాలలో దుర్భర పరిస్థితులో పనిచేస్తూ, అతితక్కువ జీతాలతో బ్రతుకీడుస్తున్నారు. ప్రణాలికా సంఘంతో సహా అనేక మంది నిపుణులు ఉద్యోగాలకి బదులు చిన్న పరిశ్రమలను, వ్యాపారాల్ని ప్రోత్సహించి ఉపాధి క‌ల్పనకు ప్రాధాన్యత నివ్వాలని చెప్పారు.
ఉదాహరణకు మన దేశంలో వేల ఏళ్ళుగా కోట్లాదిగా ఉన్న చేతివృత్తులు జీవన విధానంగా ఉన్న కోట్లాదిమందికి, ఆర్ధిక సహాయంచేసి, వారి వృత్తులను ఆధునీకరిస్తే, వారి స్థితిగతులు ఎంతో మెరుగవుతాయి. మనదేశంలో 40% పైగా పండిన వ్యవసాయ ఉత్పత్తులు  వేడిమి వలన వృధా అవుతున్నవి. చైనా తరహాలో సోలార్ తో పనిచేసీ చిన్న కోల్డ్ స్టోరేజి ప్లాంట్లు ప్రతీగ్రామంలో సహకార రంగంలో నెలకొల్పితే కనీస పక్షాన 70 లక్షల మంది యువకులకు జీవనాధారం కల్పించవచ్చును. మన దేశంలో సగానికి పైగా గ్రామాలకు మంచినీరు అందుబాటులో లేక అనేక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. సోలర్ తో పనిచేసే చిన్న స్థాయి నీటి శుద్ధి యూనిట్లను, ఇంటి పైకప్పులపై సోలార్ పానెళ్ళను సహకార రంగంలో నెలకొల్పితే కోట్లాదిమంది యువకులకు జీవనాధారాన్ని కల్పించ‌గలుగుతాము. చేనేత కార్మికులకు నూతన టెక్నాలజీతో పనిచేసే నేత యంత్రాలను అందుబాటులోకి తెస్తే, కోట్లాది చేనేత కుటుంబాల ఆర్ధిక స్థితి ఎంతో మెరుగవుతుంది. ఈనాడు మన ఐ.టి. పరిశ్రమ విదేశీ గుత్త కంపెనీలకు సబ్ కాంట్రాక్టు పనులు చేస్తోంది. మన దేశ అవసరాలకు తగినట్లుగా ఐ.టి. పరిశ్రమను ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేస్తే కోట్లాదిగా ఐ.టి ఉద్యోగాలు కల్పించవచ్చును.
ఈదేశంలో నిరుద్యోగ సమ‌స్యకు పరిష్కారం ఉన్నది! ధనిక వర్గాలు కబళించే 50 లక్షల కోట్లలో 4%, అంటే కనీసపక్షాన‌ సాలుకు 2 లక్షల కోట్లు వెచ్చించినా, ఏటికి 2 కోట్ల మంది యువతకు జీవనాధారాన్ని, తద్వారా మెరుగైన జీవితాన్ని కల్పించవచ్చును. ఆ పని చేయటానికి ఈ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అధికారం చేతికి రాగానే ధనిక వర్గాలతో కుమ్మక్కై దేశాన్ని దోచుకోవటమే వీరి ప్రవృత్తి. పోరాటంచేసి, వీరి మెడలువంచి మనం బ్రతికే హక్కును సాధించుకోవాలి. నిరాశతో, నైరాశ్యంలో కొట్టుకుపోవటం కంటే, ఒక బంగారు భవిష్యత్తు మన ముందు ఉన్నదని, అది పోరాటాల ద్వారానే మనకు అందుతుందని మనం ఎంతత్వరగా గ్రహిస్తే అంత మంచిది.
గోరంత దీపం, కొండంత వెలుగు!
చిగురంత ఆశ, జగమంత వెలుగు!
జగమంతా దగాచేసినా, చిగురంత ఆశను చూడు!
అఖిల భారత విద్యార్ధి ఫెడరేషన్

No comments:

Post a Comment