#నంద్యాల_ఎన్నికలు_వధ్యశిలపై_ప్రజాస్వామ్యం#
నంద్యాల ఎన్నికల నిర్వహణ తీరు ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్షాలు ప్రధానంగా అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థపై క్రూరమైన దాడి చేసింది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఇతర రాష్ట్రాలలో గానీ ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఇంత భారీ ఎత్తున ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం జరిగి వుండదు.
ఈ పాటికే ఎన్నికలు ఖరీదైన నేపథ్యంలో కోట్లు కుమ్మరిస్తే గానీ గెలుపొందలేని ప్రమాదకర ధోరణిని నంద్యాల ఉప ఎన్నికలు మరింత ముమ్మరం చేశాయి. ఈ అంశంలో వైకాపా కూడా తక్కువ తినలేదు. రెండూ ఒక ఆకులో చింపుళ్ళే. గతంలో విపక్షనేత జగన్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేసిన అనుభవముంది. ప్రస్తుతం అధికార దండం చేత పట్టుకున్న ముఖ్యమంత్రి పైచేయి సంపాదించి విపక్షాన్ని చిత్తు చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను మంట గలిపారు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా వుంటాయి. 1999 నుంచి 2004 వరకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం హయాంలో ప్రతిపక్షాలు గెలుపొందలేదు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా అనుసరించిన పెడ ధోరణుల గురించే వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామ్య వాదులు ఆలోచించవలసి వుంది. ఈ సందర్భంలో ఒక అంశం పేర్కొనక తప్పడం లేదు. హాస్యకళా చక్రవర్తి, ప్రగతిశీలవాది, చార్లీ చాప్లిన్ నటించిన హాస్య సన్నివేశమొకటి సమాచార మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది. సర్కస్‌లో బఫూన్‌గా పని చేసే చాప్లిన్ జంతుజాలముండే ఆవరణలోకి రాగానే గుర్రమొకటి పొడిచేందుకు తరుముతుంటుంది. దాని నుంచి తప్పించుకునేందుకు చాప్లిన్ పరిగెత్తుకుంటూ ఒక ఇనుప బోను లోనికి వెళ్ళి తలుపు వేసుకొంటాడు. తీరా చూస్తే బోనులో సింహమొకటి నిద్ర పోతుంటుంది. చివరికి చాప్లిన్ బోను నుంచి బయటపడి తప్పించుకుంటాడు. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం నంద్యాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల అవస్థ చాప్లిన్ ఎదుర్కొన్న అనుభవాన్ని తలపిస్తోంది. అందుకే రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందాలని అభిలషించాయి.
అదే సమయంలో 2019 ఎన్నికలకు నంద్యాల ఎన్నికల ఫలితాలు గీటురాయిగా వుంటాయా? రాజకీయ సమీకరణలు ఎలా వుంటాయి? సంప్రదాయంగా ఆయా పార్టీలకున్న ఓటు బ్యాంక్ అలాగే వుంటుందా? మార్పులేవైనా జరుగుతాయా? నూతన సమీకరణలు ఎలా వుంటాయి? తెలుగుదేశం, వైకాపా రెండూ బిజెపితో చెలిమి చేస్తున్నందున దళితులు, మైనార్టీల వైఖరి ఎలా వుంటుంది? ఇత్యాది అంశాలకు నంద్యాల ఎన్నికల ఫలితాలతో జవాబు లభిస్తుందని విశ్లేషకులు ఆశించారు. అయితే రాష్ట్రంలోని అధికార పార్టీ తన ధన, అధికార మదంతో మొత్తంగా ఈ రాజకీయ సమీకరణలను తుడిచి పెట్టింది. అంతేకాక పలు రకాల ప్రలోభాలు తెరమీదకు వచ్చాయి. కులాలు మతాల వారీగా పదవుల పంపకాలు జరిగాయి. కుల, మత సమావేశాలకు ఆత్మీయతనే ముసుగు తొడిగారు. ఎన్నికల సంఘం కూడా అచేతనంగా వుండిపోయింది. ఒకరు వెయ్యి రూపాయలిస్తే మరొకరు మూడు వేలు ఇచ్చారు. చీరలు, బొట్టుబిళ్ళలు, ముక్కు పుడకల పంపకానికి అంతే లేదు. 20 మంది మంత్రులు 50 మంది ఎమ్మెల్యేలు అక్కడే మకాం పెట్టారు. ఇందుకు దీటుగా వైకాపా కూడా తన బలగాన్ని నంద్యాలలో దింపింది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రూ.1500 కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటించారు. 17 వేల గృహాలు మంజూరు చేశారు. అదనంగా 10 వేల ఫించన్లు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. వలసల బతుకుతో, దుర్భిక్షంతో మిగిలిన రాయలసీమ మట్టిగొట్టుకు పోయినా సరే తన గెలుపుకు తన విధానాలకు నంద్యాల ఎన్నికలు నిదర్శనం కావాలని ముఖ్యమంత్రి పన్నిన పన్నాగంలో ప్రజలు చిక్కుకొని విలవిలలాడారు. ఇలా ఆయన మాయలోపడి మోసపోయారు. నంద్యాలలో టిడిపి గెలుపొందకపోతే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయని... కొత్తగా ప్రకటించిన గృహాలు, ఫించన్లు నిలిచిపోతాయని పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. ఈ భయాందోళనలు ఎబోలా వైరస్ లాగా వ్యాపించడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెనుభూతంగా వున్నా... మూడున్నరేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కన్నెత్తి చూడకున్నా... ప్రలోభాలలో, ధన ప్రవాహంలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది అసహజమేమీ కాదు. అయినా ప్రజాస్వామ్య విలువలు ఎంత కారుచీకట్లోనైనా మిణుగురు పురుగుల్లాగా మెరుస్తూనే వుంటాయి.
ఇంతకీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏమవుతుంది? వైకాపా గెలిస్తే కలిగే లాభమేమిటి? ఇవి కీలక ప్రశ్నలేమీ కావు. వైకాపా గెలిచి వుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అపసవ్య ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తాత్కాలికంగా బ్రేకు పడి వుండేది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి పట్టపగ్గాలుండవు. ఈ అంశంలో తెలుగుదేశం నేతల్లోనే విస్తృత చర్చ సాగుతోంది. ఇక ఇంటర్వ్యూలు కూడా దొరకవేమోనని జోకులు వేసుకుంటున్నారట. తను ఇన్నాళ్ళు రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు భూ సేకరణ సందర్భంగా అనుసరిస్తూ వచ్చిన ఏకపక్ష ప్రజా వ్యతిరేక విధానాలకు నంద్యాల ప్రజలు వేసిన ఆమోద ముద్రను రాష్ట్రం లోని ప్రజలందరికీ ఆపాదించి మరీ ఎదురు దాడికి దిగే ప్రమాదం పొంచి వుంది.
రాష్ట్రం ఈపాటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి వున్నా చట్టబద్దంగా కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి రావాల్సిన నిధులు రాబట్టకపోగా మరింత అప్పులు చేసి భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపబోతున్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనలో భూ సేకరణ సందర్భంగా దళితులు చిన్న సన్నకారు రైతులకు మరింత అపకారం జరిగే అవకాశం వుంది. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలలో అసమానతలపై నెలకొన్న భావాన్ని ముఖ్యమంత్రి ఒక్క ముక్కలో కొట్టిపారేసే అవకాశం లేకపోలేదు. రాయలసీమ ప్రజలే తనకు తన విధానాలకు చట్టబద్ధమైన లైసెన్స్ ఇచ్చారని చెప్పినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాయలసీమలో నెలకొన్న దుర్భిక్షం, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా నంద్యాల ఎన్నికలలో వంద కోట్ల ధన ప్రవాహంతో తుడిచి పెట్టుకుపోయాయి.
ప్రధాన మంత్రి మోడీ వద్ద మెప్పులు పొందేందుకు మున్ముందు మతోన్మాద శక్తులను ప్రతిఘటించే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల గొంతు నొక్కే అవకాశముంది. ఈ మూడున్నరేళ్ల కాలంలో జరిగిన అప్రజాస్వామిక పోలీసు జులుం చాలా తక్కువే. ముందున్నది ముసళ్ళ పండుగ. దళితులు, పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడే వారిపై తీవ్రమైన దమనకాండ ప్రయోగించేందుకు నంద్యాల ఎన్నికల గెలుపును ఒక సర్టిఫికెట్‌గా ముఖ్యమంత్రి చూపవచ్చు. కొసమెరుపు ఏమంటే రాష్ట్రంలో ఒక మారుమూల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందితే ప్రధాన మంత్రి ట్వీట్ చేస్తూ అభినందనలు చెప్పారంటేనే భవిష్యత్తులో టిడిపి-బిజెపి అనుబంధం ఎంత ప్రగాఢంగా వుండబోతోందో తెలుస్తోంది. వైకాపా నేత జగన్ ఇప్పటికైనా గుర్తిస్తే ఎంతో క్షేమం. అంతేకాదు! నంద్యాల ఎన్నికల తీరుపై కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు వాస్తవ రిపోర్టులు ఇచ్చి వుంటాయి. ప్రజాస్వామ్యం ఎలా పరిహసింపబడిందో చెప్పి వుంటాయి. అయినా ప్రధానమంత్రి ట్వీట్ చేశారంటే భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా బిజెపి, దాని మిత్రులు అనుసరించబోయే ప్రమాదకర ధోరణికి నిదర్శనంగా వుంది.