The Truth

Wednesday, 23 August 2017

విలువల ప్రస్తానం

రాజకీయాల్లో నైతిక విలువలు పతనమై పోతున్నాయి. రాజకీయ రంగం వ్యాపారమయమై పోయింది. డబ్బు, అధికారమే పరమావధిగా నేటి రాజకీయాలు తయారైనాయి. 1972లో విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించాను. ఆనాటి రాజకీయ నాయకత్వం కమ్యూనిస్టులే కాదు, వర్గ స్వభావం రీత్యా భూస్వాములు మరియు పెట్టుబడిదారులకు అనుకూలురైనప్పటికీ అనేక మంది కాంగ్రెస్ నాయకులు సహితం  నైతిక విలువలకు విలువనిచ్చేవారు. నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి నైతిక విలువలే ప్రేరణగా నిలిచాయి.
1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారి డబ్బు సంచులతో అరంగేట్రం చేసిన వ్యక్తులు విజయం సాధించి, రాజకీయ రంగాన్ని వ్యాపారంగా రూపాంతరం చెందించారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపూర్ణమైనది కాదు. అనేక పరిమితులతో లోపభూయిష్టమైనది. నైతిక విలువల పతనంతో మరింత బలహీనమై ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎన్నికైన ప్రజాప్రతినిథులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుండడం, పాలక పార్టీలు ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించి, ఫిరాయింపుదారులకు రక్షణ కవచంగా తయారు కావడంతో నైతిక విలువల పతనం పరాకాష్టకు చేరుకొన్నది. 
సంకీర్ణ ప్రభుత్వాల యుగం నడుస్తున్న పూర్వరంగంలో 2014 ఎన్నికల్లో ఏకపార్టీ పాలనకు అవకాశం కల్పిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు. అవినీతిరహితమైన సుపరిపాలనను అందిస్తానని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించారు. కానీ, గడచిన రెండు మూడేళ్ళుగా జరుగుతున్నదేంటి? మాది భిన్నమైన పార్టీ అని చెప్పుకొన్న బిజెపి పిరాయింపు రాజకీయాలను ప్రొత్సహిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం మొత్తాన్ని తమ పార్టీ వైపు తిప్పుకొని బోర్డునే మార్చేశారు. ఉత్తరాఖాండ్ లో ఫిరాయింపులను ప్రోత్సహించారు. గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని కాదని ఫిరాయింపుదారుల భాగస్వామ్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. తాజాగా గుజరాత్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఇదే తంతును కొనసాగించి భంగ పడ్డారు.
ఆర్.జె.డి. అధినేత అవినీతి కేసుల్లో కూరుకపోయి ఉన్నా, ఆయన పార్టీతో
ఎన్నికల ఒప్పందం చేసుకొనే నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చారు. నితీశ్ కుమార్ నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తిగా ప్రజలు భావించారు. ప్రభుత్వాన్ని కొనసాగించలేనప్పుడు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్ళడానికి బదులు, నితీశ్ కుమార్ యుపిఎ కూటమి నుండి ఫిరాయించి, బిజెపి కూటమితో జట్టుకట్టి అధికార పీఠాన్నినిలబెట్టుకొన్నారు. మోడీ ప్రవచించిన‌ సుపరిపాలన ఇదేనా?
రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నపాలక పార్టీలు ఫిరాయింపులను ప్రొత్సహించి, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను కూడా కట్టబెట్టాయి. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మినహాయించి మిగిలిన పాలక పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నవ్వులపాలు చేశారు. స్పీకర్ల వ్యవస్థ, గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టి పోయాయి. ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణ చేసి, అమలు బాధ్యతను ఎన్నికల కమీషన్ కు అప్పగిస్తే తప్ప పార్టీ ఫిరాయింపుదారులను అనుర్హులుగా ప్రకటించే నిబంధన అమలుకు నోచుకొనే పరిస్థితులు కనబడడం లేదు.
ఈ చర్చలో నాతో పాటు సాక్షి మీడియా గ్రూపు ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె.రామచంద్రమూర్తి, రాజకీయ విశ్లేషకులు శ్రీపతిరాముడు, రాజకీయ విశ్లేషకులు డా.పెంటపాటి పుల్లారావు పాల్గొన్నారు. చర్చకు సంబంధించిన యూట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=MmHzZcm9aB0

No comments:

Post a Comment